తత్త్వ గాన సుధ                                 
(1)                                                                                 
ఏమి జన్మము? ఏమి జీవనము?
నిలువెల్ల బ్రతుకు
కాలిపోవుట దేని కోసము?
ఎవరి కెవరో ఎరుక లేదు
ఏది ఎపుడో తెలిసిరాదు
మనసు చెడితే బాగుపడదు
వయసు పోతే తిరిగి రాదు
ఏమి జన్మము? ఏమి జీవనము ?
నిలువెల్ల బ్రతుకు
కాలిపోవుట దేని కోసము ?
(2)
మట్టికుండ మాలిన దేహము
పుట్టి చచ్చి
చచ్చి పుట్టి ఏమి లాభము?
ఉండ దేపుడూ మట్టికుండ
కాలగతిలో పగలకుండా
దేహముండదు కాలకుండా
దేహి ఉండును చెదరకుండా
మట్టి కుండ మాలిన దేహము
పుట్టి చచ్చి
చచ్చి పుట్టి ఏమి లాభము?
(౩)
తోడు ఎవరు? ఎవరికి తోడు?
నిజాము తెలిసిన
తోడు  ఎవడూ కోరుకోడు
తారలెన్నో ఆకసమున
తోడు నిలిచి అంబరానికి
తెల్లవారితే జాడలుండవు
గోడులే ఈ తోడులన్నీ
తోడు ఎవరు? ఎవరికీ తోడు?
నిజము తెలిసిన
తోడు ఎవడూ కోరుకోడు
(4)
ఎవరు బాధలు లేనివారుకన్నీటి జగతిలో
బాధ లెవరూ దాటలేరు
బాధలను తొలగించు శక్తి
ఎవరి కున్నది ధరణి లోన?
దైవ మందు మనసు పడితే
బాధలన్నీ కరిగిపోవు
ఎవరు బాధలు లేనివారు
కన్నీటి జగతిలో
బాధ లెవరూ దాటలేరు
(5)
నిలువ దెంతో కాలము ప్రాణం
దేహ ఒడిలో
కారిపోవును క్షణములో జీవం
కారిపోవు మేఘ జలము
కురిసి కురిసి క్షణము క్షణము
రాలిపోవు మాయ దేహము
ఎప్పుడైనా ఎక్కడైనా
నిలువ దేంతో కాలము ప్రాణం
దేహ ఒడిలో
కారిపోవును క్షణములో జీవం
(6)
తనువు నీవని మోసపోవద్దు
అది ఎంత కులికినా
వల్లకాటిలో కాలి బూది యగు
గాలి పీల్చిన దేహ ముండును
గాలి పోయిన కుప్పకూలును
చితిలో చర్మము చితికి పోవును
కనుల ముందే మాయ మగును
తనువు నీవని మోసపోవద్దు
అది ఎంత కులికినా
వల్లకాటిలో కాలి బూది యగు
(7)
పెంచుకొనిన సిరులు సంపదలు
పంచ చేరి
ముంచి తీరును మోహమును పెంచి
తృప్తి నివ్వని సిరులు ఎందుకు?
లేని సిరులకు దిగులు చెందకు
ఉన్నదానితో తృప్తి చెందితే
కలుగు సుఖము తొలగు శోకము
పెంచుకొనిన తీరును మోహమును పెంచి
(8)
తెలియకుంటే బ్రతుకు శాపము
తెలివి ఉంటే
క్షణము క్షణము దివ్య జీవనము
బ్రహ్మ నీవని బోధ చేయుచు
వెలుగు చున్నవి వేదవాక్కులు
మనసు పెట్టి మర్మ మెరిగితే
మాయ తొలగును – మహిమ తెలియును
తెలియకుంటే బ్రతుకు శాపము
తెలివి ఉంటే
క్షణము క్షణము దివ్య జీవనము
(11)
భేద భావము బాధరూపము
విశ్వమంతా
విశ్వనాథునీ దివ్య మందిరము
అలను చూడకు కడలి చూడు
అంతరించను  అంతరములు
నామ రూపము కాదు సత్యము
అంతరంగము ఆత్మమయము
భేద భావము బాధరూపము
విశ్వమంతా
విశ్వనాథుని దివ్య మందిరము
(12)
ఏవి మమతలు? ఏవి మధురములు ?
సరిపడని కొలతలు
ఎంత వెదకిన ఎండమావులు
ఎదురు చూచిన ఎదలు పగులును
ఎదురు తిరిగిన దిగులు మిగులును
పగల వెనుక పగలు దాగును
వెలుగు లారి చీకటగును
ఏవి మమతలు ? ఏవి మధురములు ?
సరిపడని కొలతలు
ఎంత వెదకిన ఎండమావులు
(13)
మనసు చపలము బ్రతుకు చంచలము
ఉన్న సమయము
ఆకసమున మెరపు చందము
నిన్న ఉన్నది నేడు లేదు
నేడు ఉన్నది రేపు రాదు
నాశమగును రూపులన్నీ
నిలిచి వెలుగు స్వరూప మొకటే
మనసు చపలము బ్రతుకు చంచలము
ఉన్న సమయము
ఆకసమున మెరపు చందము
(14)
సాధు స్నేహము జన్మ సార్ధకము
వినియోగ పడితే
భక్తి సులభము ముక్తి సాధకము
హితము చేయును సాధు సన్నిధి
సర్వ జనులకు దివ్య పెన్నిధి
క్షయము లేనిది క్షేమమైనది
మోక్ష ప్రాప్తికి మార్గ మైనది
సాధు స్నేహము జన్మ సార్ధకము
వినియోగ పడితే
భక్తి సులభము ముక్తి సాధకము
(15)
జీవు డెవరు? దేవుడు ఎవరు?
వారి నైజము
తెలిసి నపుడే తొలగు బంధము
ఊగులాడే వాడే జీవుడు
ఊరకుంటే దేవు డతను
తనను మరచిన జీవు డగును
తనను ఎరిగిన దేవు డగును
జీవు డెవరు? దేవుడు ఎవరు?
వారి నైజము
తెలిసి నపుడే తొలగు బంధము
(16)
ఎవరు మిత్రులు? ఎవరు ఆప్తులు?
సదా మనతో
కలసి మెలసి మెలుగు వారెవరు?
ఎన్నడూ విడిపోని వాడు
సదా మనతో ఉండువాడు
ఈశుడే కాపాడువాడు
నిత్యు డతడే మిత్రు డతడే
ఎవరు మిత్రులు? ఎవరు ఆప్తులు?
సదా మనతో
కలసి మెలసి మెలుగు వారెవరు?
(17)
మరచిపోనీ మనసు వేదైనా
మరువ రానిది
ధర్మ మొకటే ధరణి లోన
ధర్మముగ జీవించు వానిని
అనుసరించును దైవ మెపుడు
దైవ మెవరిని కనికరించునో
వాడే దైవము విశ్వమునకు
మరచిపోనీ మనసు వేదైనా
మరువ రానిది
ధర్మ మొకటే ధరణి లోన
(18)
భక్తియే బ్రతుకు చుక్కాని
జీవి యాత్రలో
గురుదేవుడే మార్గగామి
బాగు చేయును భక్తి ఒకటే
బ్రతుకు భవ్యము జీవి ధన్యము
భక్తి లేని జీవి బ్రతుకు
నీరు లేని బావి రీతి
భక్తియే బ్రతుకు చుక్కాని
జీవి యాత్రలో
గురుదేవుడే మార్గగామి
(19)
ఏది నీది? ఎక్కడిది నీకు?
ఏ విభవమైనా
సత్యదేవుని నిత్య వైభవము
దర్పముండదు సత్య మెరిగిన
వినయ మొప్పును నిజము తెలిసిన
ఏ తేజము ఎవరి దైనా
దైవ మహిమే అందులోన
ఏది నీది? ఎక్కడిది నీకు?
ఏ విభవమైనా
సత్యదేవుని నిత్య వైభవము
(20)
ఉన్న వెపుడూ బాధించవు
మనిషి మదిలో
ఉన్నవే వేధించును
ఏది ఉన్నా లేదు లాభము
రాగ ద్వేషము లంతరించిన
ఏది ఉన్నా సుఖము చెడదు
ఉన్న వెపుడూ బాధించవు
మనిషి మదిలో
ఉన్నవే వేధించును
(21)
గీత తెలిసిన బ్రతుకు అమృతము
తెలియకుంటే
అంత మగును వింత జీవితము
గీత తుడుచును నొసటి రాత
గీత దింపును బ్రతుకు మోత
గీత నెపుడూ విడిచి పెట్టకు
ముక్తి నొసగును కృష్ణగీత
గీత తెలిసిన బ్రతుకు అమృతము
తెలియకుంటే
అంత మగును వింత జీవితము
(22)
కర్మ లేపుడూ బంధించవు
వాస్తవానికి
కర్మ ఫలములు బాధించవు
కామ్య మెరుగని కర్మ జాతము
కోర లుడిగిన పాము పగిది
అలల లోలె కలల వోలె
కరిగి పోవును  కనుల ముందే
కర్మ లేపుడూ బంధించవు
వాస్తవానికి
కర్మఫలములు బాధించవు
(23)
ఏది ఉన్నా నాది అనుకోకు
నీది కాని
దాని నెవ్వరు దోచుకోలేరు
నాది నాదని పలవరిస్తే
ఏది నీదిగ మిగలబోదు
ఏది ఉన్నా మమత వీడితే
నీది కానిది ఏది ఉండదు
ఏది ఉన్నా నాది అనుకోకు
నీది కాని
దాని నెవ్వరు దోచుకోలేరు
(24)
దోష వస్తువు జగతిలో లేదు
దోషముంటే
చూచువాని తీరులో ఉంది
ఏది దోషము? ఏది లోపము?
విశ్వమంతా బ్రహ్మమయము
పొరలు కరిగి తెరలు తొలగితే
దర్శనీయము దైవమహిమ
దోష వస్తువు జగతిలో లేదు
దోషముంటే
చూచువాని తీరులో ఉంది
(25)
ఏది భయము? ఎవరికి భయము?
వెలుగు పడితే
భయహేతువు భ్రాంతియే యగును
ఉన్న త్రాడు తెలియ నందున
లేని పాము బుసలు కొట్టును
భ్రాంతి తొలగిన భయము ఉండదు
సత్య మెరిగిన అభయ మగును
ఏది భయము? ఎవికి భయము?
వెలుగు పడితే
భయహేతువు భ్రాంతియే యగును
(26)
ఏది పరులు చేయకుండిన
అది నీకు సుఖమో
చేయకెన్నడు నీవు పరుల కది
మంచి చేసి మంచి చూచి
మంచి తోనే మైత్రి చేసి
మంచి పెరిగి మనసు కరిగి
మంచి మనిషిగ మహిమ నెరిగి
ఏది పరులు చేయకుండిన
అది నీకు సుఖమో
చేయకెన్నడు నీవు పరుల కది
(27)
కోరుచుందురు అందరు సుఖము
వాస్తవానికి
తెలియ దెవరికి సుఖము చిరునామా
విషయ మందున సుఖము లేదు
కాల మందున కలసిరాదు
బయట లేదు లోన రాదు
నీ స్వరూపమె పరమ సుఖము
కోరుచున్డురు అందరు సుఖము
వాస్తవానికి
తెలియ దెవరికి సుఖము చిరునామా
(28)
ఏది ఎంతగ అనుభవించినను
తనవి తీరదు
తృప్తి ఉండదు మనసు చాలనదు
కలలు గన్నవి అంద వెపుడు
అందినా అవి ఉండ వెపుడు
జ్ఞాపకాలు విడిచి పెట్టవు
వ్యాపకాలు మరపు రావు
ఏది ఎంతగ అనుభవించినను
తనివి తీరదు
తృప్తి ఉండదు మనసు చాలవదు
(29)
మనుగడంతా మాయ కార్యము
మర్మ మెరిగిన
బట్టబయలు మాయ మర్మములు
లేని దానిని తెచ్చి చూపును
ఉన్న దానిని మరుగు పరచును
మనిషి బ్రతుకును మార నివ్వదు
మోక్షతీరము చేర నివ్వదు
మనుగడంతా మాయ కార్యము
మర్మ మెరిగిన
బట్టబయలు మాయ మర్మములు
(30)
గుండెలో బడబాగ్ను  లుండినా
సముద్ర జలము
చలువ నెపుడు వీడ లేదు
పిడుగులు తల మీద పడినా
విష నాగులు పాడగా లెత్తినా
ప్రళయమే ముంచు కొచ్చిన
కలత చెందడు ఆత్మవిదుడు
గుండెలో బడబాగ్ను లుండినా
సముద్ర జలము
చలువ నెపుడు వీడలేదు
(31)
నామ స్మరణము ఎంతో హాయి
విస్మరణ జరిగితే
జీవి బ్రతుకు చీకటిరేయి
నామమే నడిపించు సూటి త్రోవ
నమ్మి నామము నాశ్రయిస్తే
సొమ్ము చేయును వమ్ము చేయదు
నామ స్మరణము ఎంతో హాయి
విస్మరణ జరిగితే
జీవి బ్రతుకు చీకటి రేయి
(32)
పోయినోళ్ళ కొరకు ఏడవకు
తెలుసుకుంటే
పోక నిలిచే వారు ఎవ్వరు?
ఉన్నవాళ్ళు పోకపోరు
ఆత్మ పోదు దేహ ముందడు
తత్త్వ మెరిగిన శోక ముందడు
పోయినోళ్ళ కొరకు ఏడవకు
తెలుసుకుంటే
పోక నిలిచే వారు ఎవ్వరు?
(33)
తల్లి రాదు బిడ్డ ఏడ్చినా
బొమ్మలిచ్చి
మభ్య పెట్టి ఏడ్పు నాపును
ఏది ఇచ్చిన తృప్తి చెందక
తల్లి కొరకే తల్లడిల్లిన
తల్లి వచ్చి ముద్దులిడును
మార్గ మదియే దైవమైనా
తల్లి రాదు బిడ్డ ఏడ్చినా
బొమ్మలిచ్చి
మభ్య పెట్టి ఏడ్పు నాపును
(34)
బ్రతుకు లోన భయములే అన్నీ
ఎవరి నైనా
భయము వీడడు బ్రతికి నన్నాళ్ళు
ఎన్ని ఉన్నా భయము ఉండును
ఎవరు లేరని భయము ఉండును
వ్యాధి భయము మరణ భయము
భయము భయము బ్రతుకు భయము
బ్రతుకు లోన భయములే అన్నీ
ఎవరి నైనా
భయము వీడదు బ్రతికి నన్నాళ్ళు
(35)
నావలే జీవు లందరు
కాల కడలిలో
ఏ రేవు ఏ నావదో
పయన మైనవి నావలన్నీ
సుడులు ఏవో తెలిసి రాదు
నామమే చూపు తీరము
నడుపు వాడు వరుని సఖుడు
నావలే జీవు లందరు
ఏ రేవు ఏ నావదో
(36)
ఎవరి దేహము ఏమి తింటుందో
తెలియకున్నా
తినక పోతే దేహ ముండదు
ఎవరు ఏది ఎంత తినినా
పెరుగు దేహము తరుగు ప్రాణము
కడకు కాటికి చేరి నపుడు
భస్మమే ఏ కాయమైనా
ఎవరి దేహము ఏమి తింటుందో
తెలియకున్నా
తినక పోతే దేహ ముందడు
(37)
ఏది నష్టము? ఏది లాభము ?
సత్య మెరిగితే
నష్ట మెరుగని లాభమే లేదు
ముందు కానిది వెనుక లేనిది
నడుమ ఉన్నది లాభ మౌనా?
కాలమేదీ కనికరించదు
కారిపోవును ఉన్నవన్నీ
ఏది నష్టము? ఏది లాభము ?
సత్య మేరిగితే
నష్ట మెరుగని లాభమే లేదు
(38)
ద్వంద్వములతో  అండ ముండదు
ఎప్పుడైనా
ఆనందము ఏకమై వెలుగు
కష్ట సుఖములు వెలుగు నీడలు
ఏది ఎపుడో ఎంత వరకో
కష్ట మొచ్చిన కలత చెందకు
సుఖము లొచ్చిన సంతసించకు
ద్వంద్వములలో అంద ముండదు
ఎప్పుడైనా
ఆనందము ఏకమై వెలుగు
(39)
అహం భావము మేలుకోగానే
ఆ క్షణము లోనే
పవ్వళించును అంతరాత్మ
మిథ్య అయిన అహం భావము
కప్పివేయును అంతరాత్మను
అహం భావము అంతరించిన
ఆత్మ తేజము దివ్య మగును
అహం భావము మేలుకోగానే
ఆ క్షణము లోనే
పవ్వళించును అంతరాత్మ
(40)
నమ్మవచ్చును దేని నైనా
ఆ నమ్మకము
నమ్మ దగినది ఔనా? కాదా?
సత్యమైతే నమ్ము టెందుకు
హేతు వేమిటి సత్య మనుటకు?
నిత్యమైనది ఆత్మ ఒకటే
జ్ఞానమే ప్రమాణ మగును
నమ్మవచ్చును దేని నైనా
ఆ నమ్మకము
నమ్మ దగినది ఔనా? కాదా?
(41)
ఉన్న దానిని ఇచ్చు వారెవరు ?
ఒకవేళ ఇస్తే
ఉన్నది అను జ్ఞానమును తప్ప
సత్యజ్ఞానము గురువు ఎరుగును
శిష్యుడైతే జ్ఞాన మబ్బును
గురుని కృపతో జన్మ సఫలము
తీర్చలేనిది గురువు ఋణము
ఉన్న దానిని ఇచ్చు వారెవరు?
ఒకవేళ ఇస్తే
ఉన్న అను జ్ఞానమును తప్ప
(42)
‘నేను –నేనని’ అందు రందురు
ఆ ‘నేను’ ఏమిటో
తెలిసి పలికే వారు ఎందరు?
‘నేను’ ఎవరిని అడిగి చూడు
మాయ మగును నేను అనునది
నేను పోయిన తాను మిగులును
తానె సత్యము తానె సర్వము
‘నేను-నేనని’ అందు రందురు
ఆ ‘నేను’ ఏమిటో
తెలిసి పలికే వారు ఎందరు?
(43)
మనిషి సృష్టించేది ఏముంది?
ఈ వింత జగతిలో
మనిషియే సృష్టింప బడినాడు
సృష్టి ఒక మాయ కార్యము
మనిషి బ్రతుకు స్వప్న తుల్యము
మేలుకొనిన స్వప్న ముండదు
మేలు తెలిసిన మాయ నిలవదు
మనిషి సృష్టించేది ఏముంది?
ఈ వింత జగతిలో
మనిషియే సృష్టింప బడినాడు
(44)
మాయ తత్త్వము తెలుసుకో జీవా!
సద్గురుని కృపతో
పారిపోవును క్షణములో మాయ
లేకనే కనిపించు పాము
లేకపోవును త్రాడు తెలిసిన
లేకనే నడిపించు మాయ
మాయ మగును మహిమ తెలిసిన
మాయ తత్త్వము తెలుసుకో జీవా!
సద్గురుని కృపతో
పారిపోవును క్షణములో మాయ

రచన – గాత్రం – సంగీతం :
స్వామి సుందర చైతన్యానంద